Nagari Ysrcp : చిత్తూరు జిల్లా నగరి వైసీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీఎం జగన్ స్వయంగా నేతల చేతులు కలిపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ నగరిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా, వైసీపీ నేత, ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కేజే శాంతి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆయన ప్రయత్నించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ తో కాసేపు మాట్లాడిన సీఎం జగన్, ఆమెకు సర్దిచెబుతూ… మంత్రి రోజా, కేజే శాంతి చేతులు కలిపేందుకు ప్రయత్నించారు. ఇద్దరూ చేతులు కలిపినట్టే కలిసి వెంటనే వెనక్కి తీసుకున్నారు. నగరిలో పరిస్థితులు మంత్రి రోజాకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతలే ఆమెను ఓడించేందుకు రెడీ అయినట్లు టాక్ నడుస్తోంది. దీంతో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం జగన్ రంగంలోకి దిగారు. నగిరిలో సభా వేదికపై సీఎం జగన్ మంత్రి రోజా, మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి ఇద్దరి చేతులు కలిపారు. కానీ మంత్రి రోజా వెంటనే చేయి వెనక్కి తీసుకున్నారు. కేజే శాంతి కూడా తనకెందుకులే అన్నట్లు ఉన్నారు. గత కొంత కాలంగా మంత్రి రోజా, కేజే శాంతి మధ్య వర్గపోరు నడుస్తోంది.