Visakha Harbour Fire Accident : విశాఖపట్నం హార్బర్ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 40 బోట్లు కాలి బూడిదయ్యాయి. అయితే అగ్ని ప్రమాదానికి అసలు కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి ముందుగా యూట్యూబర్ నాని కారణం కావొచ్చని ఆ కోణంలో విచారణ చేపట్టారు. క్రికెట్ బెట్టింగ్, గొడవల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యూట్యూబర్ లోకల్ బాయ్ నాని ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నారన్న కారణంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అగ్ని ప్రమాదంలో నాని బోటు కూడా కాలిపోయిందని సమాచారం. ఆదివారం రాత్రి ప్రమాదం జరగడానికి ముందు లోకల్ బాయ్ నాని తన బోటులో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన భార్య సీమంతం అనంతరం స్నేహితులకు నాని బోటులో పార్టీ ఇచ్చాడని సమాచారం. ఈ పార్టీలో గొడవ జరిగిందని, ఆ కారణంగానే బోటుకు నిప్పుపెట్టారని, మంటలు ఇతర బోట్లకు వ్యాపించాయని పోలీసులు అనుమానించారు. దీంతో పాటు ఓ బోటు అమ్మకం విషయంలో జరిగిన గొడవ కారణంగా నిప్పు పెట్టారని మరో వాదన వినిపిస్తుంది.