నిద్ర హార్మోన్ విడుదల కాదు :
ఫోన్‌ని మంచం మీద, తల దగ్గర, లేదా మంచం పక్కన అస్సలు పెట్టుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మనం మనకు తెలియకుండానే ఎక్కువ సమయం ఫోన్‌లో అవీ ఇవీ చూస్తూ గడిపేస్తుంటాం. ఫలితంగా మనపై బ్లూలైట్ ఎక్స్‌పోజర్ పెరిగిపోతుంది. దీంతో జీవ గడియారం( బయొలాజికల్ క్లాక్) పనితీరు దెబ్బతింటుంది. నిద్రపోయే ముందు మెదడు మన శరీరంలోకి మెలటోనిన్ అనే హార్మోన్‌ని విడుదల చేస్తుంది. చుట్టూ ఉండే చీకటికి స్పందించి మన శరీరం ఇక నిద్రపోవాల్సిన సమయం అయింది అని మెదడుకు అర్థం అయి ఈ పని చేస్తుంది. అయితే మనం ఇంకా కాంతిలోనే ఉండేసరికి మెదడు ఈ హార్మోన్‌ని విడుదల చేయడంలో తడబాటుకు గురవుతుంది. దీంతో మనకు నిద్ర తగ్గిపోతూ ఉంటుంది. అది క్రమేపీ నిద్రలేమికి దారి తీస్తుంది. ఇదే అన్ని అనారోగ్య సమస్యలకు మూలం అన్నట్లు తయారవుతుంది.