Peddapalli News : అన్నాచెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. సోదరుడికి రాఖీ కట్టి జీవితాంతం తమకు అండగా ఉండాలని కోరుకుంటారు ఆడపడుచులు. తెలంగాణలో రాఖీ పండుగకు చాలా విశిష్టత ఉంది. ఎన్ని పనులున్నా, ఎంత దూరంలో ఉన్నా… రాఖీ పండుగకు ఆడపడుచులు అన్నదమ్ముల వద్దకు వచ్చి రాఖీ కడతారు. తమ బంధాన్ని గుర్తుచేసుకుంటారు. అయితే రాఖీ పండుగ నాడు పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో గుండెపోటుతో అకస్మాత్తుగా అన్న మృతి చెందాడు. అన్నయ్య మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరైన సోదరి..అన్న భౌతిక కాయానికే రాఖీ కట్టింది. ధూళికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య అనే వ్యక్తి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. రాఖీ కట్టేందుకు గ్రామానికి వచ్చిన సోదరి గౌరమ్మ దుఃఖంలో మునిగిపోయింది. ఆడబిడ్డలను చూసి అప్పటి దాకా ఎంతో సంతోషంగా ఉన్న కనకయ్య ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో బంధువులు రోధించారు. దుఃఖంతోనే అన్న కనకయ్య మృతదేహానికి సోదరి గౌరమ్మ రాఖీ కట్టింది. గౌరమ్మ అనుబంధాన్ని చూసి బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది.