Muthireddy On Palla : జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి సొంత పార్టీ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డిపై విమర్శలు చేశారు. చేర్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎక్కడైనా భూకబ్జాలకు పాల్పడినట్లు రుజువు చేస్తే ప్రాణత్యాగం సిద్ధమని విపక్షాలకు సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ ప్రజలకు సేవ చేయడమే నేర్పారు కానీ, భూ కబ్జాలు నేర్పలేదని అన్నారు. తాను ఎక్కడ భూకబ్జా చేశానో నిరూపించాలని డిమాండ్ చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ముత్తిరెడ్డి ఫైర్ అయ్యారు. జనగామ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులను పల్లా డబ్బులతో కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కేడర్ ను పల్లా రాజేశ్వర్ రెడ్డి అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం అందర్నీ కలుపుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తుంటే.. బయట పార్టీల నుంచి వచ్చిన వారిని కుక్కలు నక్కలు అంటూ అవమానపరిచారన్నారు. వారితో పాటు సీఎం కేసీఆర్‌ను కూడా పల్లా అవమాన పరిచారన్నారు. దొడ్డి కొమురయ్య వారసుడుకి పల్లా కాలేజీలో సీటు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పల్లా పాత్ర ఏంటో? అందరికీ తెలుసన్నారు. జనగామ ప్రజలతో సంబంధం లేని వ్యక్తి పల్లా అంటూ విరుచుకుపడ్డారు.