Kodikathi Case : విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కోడికత్తి కేసులో ముఖ్య నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ కాదని, మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీను,వైసీపీ నేతలని నిందితుడి తరఫు న్యాయవాది సలీమ్ ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ కోర్టుకు హాజరైతే వాస్తవాలు బయట పెడతామని సలీమ్ అంటున్నారు. అయితే సీఎం జగన్ తరఫున వాదిస్తున్న న్యాయవాది వెంకటేశ్వరరెడ్డి బుధవారం మాట్లాడుతూ… నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉందని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో ఆ విషయాన్ని దాఖలు చేసిందని తెలిపారు. కోడికత్తి కేసులో ఎన్‌ఐఏ 39 మంది సాక్షులను విచారించిందన్నారు. 2017లో శ్రీనివాస్‌పై కేసు నమోదైందన్నారు. నిందితుడు శ్రీనివాస్ పదునైన ఆయుధంతో జగన్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో నమోదు చేశారన్నారు.